జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వివాహం ఆలస్యం కావడానికి కారణాలు
వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. అయితే కొందరికి తగిన వయసులో వివాహ ప్రయత్నాలు ప్రారంభమైనప్పటికీ, అనేక కారణాల వల్ల వివాహం ఆలస్యమవుతూ ఉంటుంది. మంచి సంబంధాలు వచ్చినా కుదరకపోవడం, నిశ్చయమైన వివాహాలు చివరి నిమిషంలో ఆగిపోవడం, కుటుంబ పరమైన అడ్డంకులు లేదా సరైన జీవిత భాగస్వామి లభించకపోవడం వంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఏది ఏమైనప్పటికి, తమ చుట్టూ ఉన్నవారందరూ పెళ్ళిళ్ళు చేసుకొని స్థిరపడిపోతుంటే, ఒకపక్క పెళ్లి చూపులే విఫలం అవ్వడం అనేది చాలా బాధకారమైన విషయంగా చెప్పవచ్చు. ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అన్న విషయం మాత్రం వ్యక్తిగత జన్మకుండలి ద్వారా మాత్రమే అసలైన కారణం తెలుస్తుంది.
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, జన్మకుండలిలోని సప్తమ స్థానమును వైవాహిక స్థానంగా, కళత్ర స్థానంగా (కళత్రం అనగా భార్య/భర్త) చెప్పబడుతుంది. సప్తమ స్థానంలో నీచ లేదా పాప గ్రహములు ఉన్నా, వివాహానికి దారి తీసే మార్గాలకు అడ్డంకులు ఏర్పడతాయి. దీనినే వైవాహిక దోషం అని, వివాహ బాధ అని కూడా పిలుస్తారు. సప్తమ స్థానంలో ఉన్న గ్రహాలు గాని, సప్తమాధిపతి గాని వేధకు గురి అయినపుడు వివాహం ఆలస్యం కావడం లేదా వివాహానికి తీవ్ర ఇబ్బందులు రావడం జరుగుతుంది.
వివాహం ఆలస్యం కావడానికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆరు గ్రహాలు కారణం అవుతాయి. అవి రాహు, కేతు, కుజ, శని, గురు, శుక్ర, రవి గ్రహాలు ముఖ్య కారణం అవుతాయి. వివాహం ఆలస్యం కావడానికి ఈ గ్రహాలు ఏ విధంగా కారణం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాము.

కుజుడు:
కుజుడు జన్మకుండలిలో 1,2,4,7,8 లేదా 12వ భావంలో ఉంటే, ఆ జాతకులకు కుజ దోషం ఉన్నట్టు గుర్తించాలి. కుజ దోషం ఉన్న జాతకులకు వివాహం ఆలస్యం అవుతుంది. ఒకవేళ వివాహం కుదిరినా, ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాకె అవుతుంది. కొందరి జాతకాలలో ఈ కుజుడు వలన నిశ్చితార్థం జరిగి పెళ్ళి ఆగిపోవడం, పొంతనలు కుదరకపోవడం కూడా జరుగుతుంది.
గురువు:
స్త్రీ జాతకులకు జన్మకుండలిలో గురు గ్రహము భర్తను సూచిస్తుంది. జన్మకుండలిలో గురువు నీచపడిన, పాపత్వము పొందినా, తగిన వరుడిని పొందడం దాదాపు కష్టతరం అవుతుంది. జన్మకుండలిలో గురువు 6,8 లేదా 12 స్థానాలలో అనగా దుస్థానాలలో ఉంటూ, శని లేదా రాహు యొక్క దృష్టి పడినట్లైతే, ఆ స్త్రీ జాతకులకు వివాహము ఆలస్యము అవుతుంది.
శుక్రుడు:
ప్రేమ, అందం, అనుబంధాలు, వివాహం అన్నిటిని శుక్రుడు సూచిస్తాడు. జన్మకుండలిలో శుక్రుడు బలహీనంగా ఉన్నా, వక్రగతిలో ఉన్నా, లేదా నీచ స్థానంలో ఉన్నా జాతకులకు వివాహ విషయాలలో చాలా సమస్యలు కలుగుతాయి. శుక్రుడు వక్రగతిలో ఉన్నట్లైతే, వివాహ విషయాలలో ఆ జాతకులకు కర్మ భారం ఉన్నట్టు గుర్తించాలి. దీని వలన వివాహం ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నది.
రవి:
జన్మకుండలిలో రవి సప్తమ స్థానంలో అనగా వైవాహిక స్థానంలో ఉన్నట్లైతే అది అనుకూలమైన గ్రహస్థితి కాదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఎందుకనగా, సప్తమ స్థానంలోని రవి జాతకునికి అహంకారాన్ని, ఆధిపత్య ధోరణిని కలిగిస్తాడు. జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో చాలా నియమాలు పెట్టుకుంటారు. దీని వలన సరైన సంబంధం వీరికి దొరకడం, వీరు దాని పట్ల ఒక నిర్ణయానికి రావడం చాలా కష్టం అవుతుంది. దీని వలన వివాహం ఆలస్యం కావచ్చును.
శని
జన్మకుండలిలో శని గ్రహం సప్తమ స్థానంలో ఉన్నా, సప్తమాధిపతితో కలిసినా లేదా సప్తమ స్థానంపై దృష్టి పడినా వివాహం ఆలస్యం కావచ్చు. శని ప్రభావం వల్ల మంచి సంబంధాలు వచ్చినా వివాహం ఖాయం కావడానికి సమయం పట్టడం, బాధ్యతలు లేదా కుటుంబ పరిస్థితుల కారణంగా వివాహం వాయిదా పడటం జరుగవచ్చు. అయితే శని స్థానం, బలం, ఇతర గ్రహాల సంబంధాలను పరిశీలించిన తర్వాతే దాని ప్రభావాన్ని నిర్ధారించాలి.
రాహువు-కేతువు:
జన్మకుండలిలో సప్తమ స్థానంలో అనగా వైవాహిక స్థానంలో రాహువు ఉన్నట్లైతే, ఆ జాతకులకు వివాహ విషయంలో గందరగోళం ఏర్పడుతుంది. భిన్నమైన ఊహలు, సాంప్రదాయానికి విరుద్ధమైన సంబంధాలు కుదరడం జరుగుతుంది. దీని వలన వివాహం ఆలస్యం అవుతుంది. రాహువు యొక్క దృష్టి సప్తమ స్థానం పై ఉన్నా కూడా వివాహం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి. అది వ్యక్తిగత జన్మకుండలి పరిశీలన ద్వారా మాత్రమే, నిర్ధారణ చేయవచ్చు. అదే, జన్మకుండలిలో కేతువు ఉన్నట్లైతే, ఆ జాతకులకు వివాహం పైన విరక్తి కలిగిస్తాడు. దీని వలన వివాహం పై ఆసక్తి లేకపోవడం, ఆధ్యాత్మిక ఆలోచనలు పెరగడం వలన, వైవాహిక జీవితంలో స్తిరపడటానికి చాలా సమయమే పడుతుంది.
వివాహం ఆలస్యం కావడానికి కారణమయ్యే ముఖ్యమైన దోషాలు:
జన్మకుండలిలో ప్రతికూల గ్రహస్థితి ఉన్నట్లైతే, దానిని దోషం అని పిలుస్తారు. దీని వలన వ్యక్తి జీవితంలో కొన్ని విధమైన సమస్యలు ఏర్పడతాయి. అది దోషమును బట్టి సమస్యలు మారతాయి. వివాహానికి ఆటంకాలు, ఆలస్యం కలిగించే దోషాలు గురించి ఇక్కడ తెలియజేస్తున్నాను. అవి ఏమనగా, కుజ దోషము, కళత్ర దోషము, పితృ దోషము, కాలసర్ప దోషము, శాప యోగము, పాప కర్తరీ యోగము. ఈ దోషములు, అవయోగముల వలన జాతకులకు వివాహ సమస్యలు, వివాహానికి ఆటంకాలు రావడం, ఆలస్యం కావడం జరుగుతుంది.
కాలసర్ప దోషము:
జన్మకుండలిలో రాహువు, కేతువు గ్రహాల మధ్య ఇతర ఏడు గ్రహాలు ఏమిడి ఉన్నట్లైతే, వారికి కాలసర్ప దోషం ఉన్నట్టు గుర్తించాలి. 12 రకాల కాలసర్ప దోషముల గురించి, వాటి ప్రభావాల గురించి క్షుణ్ణంగా వివరించాను, ఇక్కడ క్లిక్ చేసి చదవగలరు. కాలసర్పదోషం వలన జీవితంలో ఎన్నో ఘట్టాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. వివాహం విషయంలో కూడా ఈ కాలసర్పదోషం ప్రభావం ఉంటుంది. కాలసర్పదోషం ఉన్న జాతకులకు పరిస్తితి ఎలా ఉంటుంది అంటే, ‘ఇక కొన్నిరోజుల్లో పని పూర్తి అయిపోతుంది. ఇక అంతా మంచే జరుగుతుంది’ అని అనుకునే దాకా పరిస్థితులు వచ్చి, మళ్ళీ వెంటనే తిప్పి కొడతాయి.ఈ దోషం ఉన్న జాతకులకు వివాహం ఆలస్యం కావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం జరుగుతుంది.
కళత్ర దోషం:
సప్తమ భావమును కళత్ర భావము అని, వైవాహిక స్థానము అని కూడా పిలుస్తారు. సప్తమ స్థానంలో పాప గ్రహములు ఉన్నా, పాప గ్రహముల దృష్టి పడినా, సప్తమాధిపతి బలహీనంగా ఉన్నా, ఆ జాతకులకు కళత్ర దోషము ఏర్పడినట్టు గుర్తించాలి. ఈ దోషము వలన మంచి సంబంధం దొరకడం కష్టం అవుతుంది. తరచూ పెళ్లి దాకా వచ్చిన సంబంధాలు తప్పిపోవడం జరుగుతుంది. ఈ దోషం ఉన్న వారికి వివాహ పొంతన కూడా కష్టతరం అవుతుంది. కళత్ర దోషం గురించి సంపూర్ణంగా తెలుసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోగలరు.
పితృ దోషము:
జన్మకుండలిలో రవి, శని గ్రహములు పరివర్తన చెందితే (రవి రాశిలో శని మరియు శని రాశిలో రవి) ఉంటే దానిని పితృదోషముగా గుర్తించాలి. రవి, శని ఒకరిపై మరొకరి దృష్టి పడినప్పుడు లేదా రవి, శని కలసి ఒకే భావములో ఉన్నపుడు జాతకునికి పితృదోషం ఉన్నట్టుగా గుర్తించాలి. ఇక్కడ రవి, శని సంబంధం లాగానే జాతకములో గురు, బుధ గ్రహముల వలన కలిగే సంబంధము కూడా పితృదోషమును సూచిస్తుంది. కాకపోతే గురు, బుధ వలన కలిగే పితృదోషం ఎక్కువ ప్రభావం చూపించదు. రాహు, కేతు, శని, రవి, బుధ, గురు గ్రహముల వలన, నవమ భావము వలన పితృ దోషము ఏర్పడుతుంది. ఈ పితృ దోషము గురించి పూర్తిగా తెలుసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి. కుటుంబంలో తరతరాలుగా వివాహం ఆలస్యం అవుతూనే ఉంది అంటే, పితృదోషం ఉన్నట్టు సంకేతంగా భావించాలి. ఒకవేళ జన్మకుండలి పరిశీలన చేస్తే, అందులో కూడా ఈ దోషము కనిపిస్తుంది. పితృదోషం ఉన్న జాతకులు, పితృ పక్షంనాడు శ్రాద్ధ కర్మలు నిర్వహించడం చేయాలి. గయ, ప్రయాగరాజ్, వారణాసి వంటి పుణ్యక్షేత్రాలలో పిండ ప్రదానాలు చేయడం వలన పితృరుణం తీరుతుంది.
శాప యోగం:
జన్మకుండలిలో శని మరియు రాహువు కలసి ఒకే రాశిలో ఉంటే, ఆ జాతకులకు శాప యోగం ఉన్నట్టు గుర్తించాలి. గత జన్మ పాప కర్మల ఫలితంగా ఈ శాపయోగం ఏర్పడుతుంది. ఈ శని, రాహు సంగమం అనేది జన్మకుండలిలోని సప్తమ స్థానంలో జరిగితే, దాని వలన అంతుపట్టని కారణాల వలన వివాహ విషయంలో ఆలస్యం అవుతుంది. ఆ ఆలస్యం ఎందుకు అనేదానికి సరైన కారణం కూడా తెలియదు. శాప యోగము గురించి పూర్తిగా తెలుసుకొనుటకు ఈ లింకును క్లిక్ చేయగలరు.
కుజ దోషము:
జన్మకుండలిలో 1,2,4,7,8,12 స్థానాలలో కుజుడు ఉన్నట్లైతే, వారికి కుజ దోషం ఉన్నట్టు గుర్తించాలి. ఈ కుజ దోషం ఉన్నంత మాత్రాన, వివాహం ఆలస్యం అవుతుందని అర్థం కాదు. దాదాపు 50 శాతం మందికి పైనే ఈ కుజ దోషం ఉంటుంది. కానీ అందరి మీద సమానమైన ప్రభావం ఉండదు. కుజ దోషం గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ఈ లింకుని క్లిక్ చేయండి.
పాప కర్తరి యోగం:
జన్మకుండలిలో సప్తమ భావానికి అనగా వైవాహిక స్థానానికి గాని లేదా శుక్ర గ్రహానికి గాని ఇరువైపులా పాప గ్రహాలు ఉన్నట్లైతే, ఆ జాతకుడికి పాపకర్తరీ యోగం ఉన్నట్టు గుర్తించాలి. దీని ప్రభావం వలన ఆడకత్తెరలో పోక చెక్క లాగా ఉంటుంది. ఈ గ్రహస్థితి వల్ల వివాహ భావం లేదా శుక్రుడి శుభ ఫలితాలు బలహీనపడే అవకాశం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఒక్కొక్క గ్రహాన్ని విడిగా పరిశీలించినప్పుడు పెద్దగా ప్రతికూలత కనిపించకపోయినా, ఈ గ్రహాల కలయిక కారణంగా వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు, సంబంధాలు కుదరకపోవడం, వివాహం ఆలస్యం కావడం వంటి పరిస్థితులు ఎదురుకావచ్చని సంప్రదాయ జ్యోతిష్యంలో వివరిస్తారు.
జన్మకుండలిలో వివాహ బాధ ఉన్నపుడు జాతకుడి జీవితంలో ఎదురయ్యే సంకేతాలు:
- జాతకులకు వివాహం చేయదలచి ఎన్నో సంబంధాలు చూసి, చివరకి ఒక సంబంధం ఖాయం అయిపోయింది అనుకునే సమయానికి, ఏదో ఒక చిన్న కారణం చేత ఆ సంబంధం తప్పిపోతుంది.
- కొందరికి నిశ్చితార్థం జరిగి, వివాహం ఆగిపోతుంది. అలాంటి జాతకుల యొక్క జన్మకుండలిలో వివాహ బాధ దోషం ఉన్నట్టు గుర్తించవచ్చు.
- కొందరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటారు. కానీ వివాహం దగ్గరకి వచ్చేసరికి ఏదో ఒక ఊహించని సంఘటన జరగడమో, కుటుంబ సభ్యులు వ్యతిరేకించడమో, కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి హాని కలుగడమో, ప్రేమించిన వ్యక్తి వెనుకడుగు వేయడమో వంటి ఏదో ఒక కనిపించని కారణం ఉంటే వారికి వివాహ బాధ జన్మకుండలిలో ఉన్నట్టే అని గుర్తించాలి.
ఇలా వివాహానికి ఈ విధమైన అడ్డంకులు వస్తుంటే, ఖచ్చితంగా పరిహారములు జరిపించుకోవాలి. వైవాహిక దోష నివారణకు, వివాహ బాధ దోష నివారణకు గానూ, వివాహ బాధ నివారణ హోమము, వివాహ యేష్టి అను పరిహారములను జరిపించుకోవాలి. జన్మకుండలిలో ఏ గ్రహములు వివాహమునకు అడ్డంకులు ఏర్పడుతున్నాయో పరిశీలించుకొని, ఆ గ్రహముకు తగ్గ పరిహారములను కూడా జరిపించుకోవాలి.
మీ వివాహం ఎందుకు ఆలస్యమవుతోంది? మీ జన్మకుండలిలో ఎలాంటి దోషాలు ఉన్నాయి? వాటికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? అనే విషయాలను వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారా తెలుసుకోవచ్చు. ప్రతి జాతకం ప్రత్యేకమైనది కాబట్టి, గ్రహస్థితులను సమగ్రంగా పరిశీలించిన తరువాతే తగిన పరిహారాలను నిర్ణయించాలి.
వివాహానికి సంబంధించిన దోష నివారణకు, శాస్త్రోక్త పరిహార క్రతువుల నిర్వహణకు మీ జన్మకుండలిని పరిశీలించుకోవాలనుకుంటే ఈ లింకును క్లిక్ చేయండి.
మరిన్ని వివరాలకు: www.brahmatantra.com | 9846466430
Related Articles:
- జీవితంలో ఆలస్యంగా విజయం అందించే రాజయోగాలు
- కేతువు అనుకూలంగా ఉంటే జాతకుడికి ఇన్ని అద్భుత యోగాలను కలుగజేస్తాడా?
- శాప యోగం అంటే ఏమిటి? శని రాహు సంగమం వల్ల కలిగే ఫలితాలు
- రాహువుతో ఏ గ్రహం కలిసినా అశుభమేనా? రాహు గ్రహ సంయోగాల వల్ల కలిగే ఫలితాలు ఇవే!
- జన్మకుండలిలో గురువు అనుకూలంగా ఉంటే, ప్రతికూలంగా ఉంటే ఫలితాలు
- జన్మకుండలిలో బుధుడు అనుకూలంగా ఉంటే లేదా ప్రతికూలంగా ఉంటే ఏర్పడే ఫలితాలు ఏమిటి?
- 12 రకాల కాలసర్పదోషాలు-Kalasarpa Yoga
- సంపూర్ణ జాతక పరిశీలన – Complete Personal Horoscope Reading
