వివాహ పొంతన
పెళ్ళి అనేది ఇద్దరి జీవితాలనే కాదు, రెండు కుటుంబాలను కలిపే శుభకార్యం. కాబట్టి కేవలం గుణాలెన్ని వచ్చాయో చెప్పి వదిలేయకుండా సంతానం, వైవాహిక జీవితం, మాంగల్య బలం వంటి ఇంకా ఎన్నో అంశాలు దృష్టిలో ఉంచుకొని వివాహ పొంతన పరిశీలించాలి. సాధరణంగా, వధూవరులకు గుణమేళన చక్రం ద్వారా ఫలితాలు నిర్ణయిస్తారు. ఈ ఒక్క గుణమేళన చక్రం ఆధారంగా ఫలితాలు సంపూర్ణంగా నిర్ణయించడం, నిర్ణయం చేయడం సరైన పద్ధతి కాదు. ఈ గుణమేళన చక్రంలో కనీసం 18 పాయింట్లు వస్తే పర్వాలేదు , ఆ పైన 36 పాయింట్ల వరకు ఎంతైనా వస్తే అన్నీ రకాలుగా యోగదాయకమని భావిస్తారు. ఈ విధంగా గుణమేళన చక్రంలో 26, 36 పాయింట్లు వచ్చాయని, చాలా విశేషమని భావించి చేసిన వివాహాలలో నూటికి 10 శాతం కూడా సఫలీకృతం కాలేదు. వివాహ సమయంలో వధూవరుల వ్యక్తిగత కర్మఫల యోగాలను తప్పక పరిశీలించాలి. వధువుకు లగ్న, చతుర్థ, పంచమ, సప్తమ, అష్టమ భావాధిపతులు, వారి యొక్క స్థితిగతులు, సంతానం, గుణములు, కళత్రము, మాంగల్యము, ఈ భావాధిపతులు బలాబలాలను బట్టి వారి యొక్క వైవాహిక జీవితం నిర్ణయం చేయాలి. వరునికి లగ్న, సప్తమ, అష్టమ, దశమ, ఏకాదశ స్థానములు, అనగా తనుభావము (ఆరోగ్యము, మనస్సు), భార్య స్థానాధిపతి, ఆయుః స్థానాధిపతి, ఉద్యోగ, ఆదాయాధిపతి, పూర్వజన్మ కర్మ స్థానాధిపతి, వీరిని పరిగణలోకి తీసుకొని, ఆ గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలించి నిర్ణయించవలెను. పురుషునికి వీర్యకారకత్వ గ్రహము యొక్క ప్రభావము ఏ విధముగా చూపించునో పరిశీలించాలి. ఈ విధమైనటువంటి దోషాలను సంపూర్ణంగా పరిశీలించాలి. అలా కాకుండా వివాహాలు జరిపిస్తే, వివాహానంతరం స్త్రీ పురుషులలో ఎవరో ఒకరు పర సాంగత్యాలకు దారి తీయును.
ప్రస్తుత కాలంలో అంతటి సూక్ష్మ పరిశీలన ఏ జ్యోతిష్యులు చూడటం లేదు. పంచాంగంలో గుణమేళన చక్రం చూసి ఫలితాలు చెబుతున్నారు. ఇది ఎంత వరకు సరైన పద్ధతి? వధూ వరుల తల్లిదండ్రులు కూడా వరునికి మంచి సంపాదన, ఆస్తి ఉంటే చాలని భావించి, తమ బిడ్డ గొప్ప స్థితిపరులైన కుటుంబానికి యజమాని అవుతుందని భావించి కక్కుర్తి పడే సంధార్భాలు నా అనుభవంలో ఎన్నో చూశాను. వివాహానంతరం గొప్ప స్థితి గతులు రాకపోగా, దుర్భరమైన జీవితాన్ని వారు అనుభవించాల్సి ఉంటుంది. వధువు లేదా వరుడు దంపతులలో ఒకరు ఆత్మహత్యలు చేసుకోవడం, విడాకులు తీసుకోవడం, నిరంతరం గొడవలు, అశాంతి, చివరకు విడాకులు లేదా పునర్వివాహం, ఇవియే జరిగుతున్నాయి.
జాతకములో దోషములు, గ్రహాల అవయోగములు, ఉన్నట్లైతే వాటికి, వివాహానికి ముందుగానే పరిహారాలు జరిపించిన వారి దుష్ట ప్రభావాలు నిర్మూలించబడతాయి. వివాహం చేయడం, చేతులు దులుపుకోవడం అని భావిస్తే, తరువాతి కాలంలో ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు. తమ సంతానానికి గ్రహ దోషాదుల నుండి, వాటి దుష్ప్రభావాల నుండి ముక్తి కలిగించడం గృహ యజమాని ధర్మం. వివాహం అనే అంశం జీవితంలో అత్యంత ప్రధానమైన అంశం. దాని మీద అన్నీ అంశాలు ఆధారపడి ఉంటాయన్న విషయాన్ని ఎప్పటికీ మర్చిపోరాదు. కొన్ని కుటుంబాలలో వివాహనంతరం మెట్టినింటి వారికి అత్త మామలకో లేదా మరదులకు, భర్తకో అనారోగ్యం, ఆర్థిక నష్టం, కలిగిందంటే, దానికి కారణం తమ కోడలు వారి ఇంత అడుగు పెట్టిన నుండి ఇలా జరుగుతోంది అని భావిస్తారు. కొన్ని కుటుంబాలలో వారిని చులకనగా లేదా కర్కశంగా ప్రవర్తిస్తారు. ఒక విషయం ఇక్కడ మనం గ్రహించాలి. వారికి కలిగిన రోగాలకో లేదా ఆర్థిక నష్టాలకు ఆ ఇంటి కోడలు, ఆమె జాతక పరిస్థితులు ఎందుకు దోహదపడతాయో కొంచెం వివేకంతో ఆలోచిస్తే అర్థమవుతుంది. ఏ ఆడపిల్ల అయినా మన కూతురు వలెనే కదా! మెట్టినింటి వారు వారి కుటుంబీకుల వ్యక్తిగత గ్రహాలు, యోగాలను బట్టి వారికి మరుదులు లేదా అత్తమామలకు, భర్తకి కూడా, అవయోగాలు కలుగడం సహజం. వారి యొక్క వ్యక్తిగత జన్మకుండలిలోని లాభాధిపతి, ఆయుః స్థానాధిపతి, వ్యాధి స్థానాధిపతులు వారికి వ్యక్తిగతంగా ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది గాని తమ ఇంటికి ప్రవేశించిన కోడలి వలన కాదని గ్రహించాలి. ఒక వివాహ విషయమే కాకుండా జన్మకుండలిలో ఉన్న అవయోగాలకు మొదట్లో పరిహరాదులు, ప్రాయశ్చిత్తములు జరిపిస్తే సరిపోతుంది గదా. విజ్ఞులు గ్రహించాలి.
మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబరు: 9846466430
chakrapani.vishnumaya@gmail.com